కర్ణాటకలో వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేస్తాం: రేవంత్‌ రెడ్డి

 


దిల్లీ, సామాజిక స్పందన

 ముఖ్యమంత్రి కేసీఆర్‌ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణపై పార్టీ అధిష్ఠానంతో చర్చించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించినట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల వ్యూహ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు చెప్పారు. పార్టీ సీనియర్‌ నేతలు రాష్ట్ర నాయకులకు కొన్ని సూచనలు చేశారని అన్నారు. కర్ణాటకలో అవలంభించిన వ్యూహాల్లో కొన్నింటిని ఇక్కడ కూడా అమలు చేస్తామన్నారు. వ్యూహాత్మకంగా వ్యవహరించి విజయం సాధించాలని అధిష్ఠానం సూచించినట్లు చెప్పారు. ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే.. వీలైనంత త్వరగా సరిచేసుకుంటామని తెలిపారు.

భారాసతో ఎలాంటి పొత్తులు ఉండబోవని కాంగ్రెస్‌ అగ్రనేతలు స్పష్టంగా చెప్పినట్లు మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌ తెలిపారు. కాంగ్రెస్‌, భారాస ఒకటేనని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. జాతీయస్థాయిలోనూ ప్రతిపక్షపార్టీలతో భారాసను భాగస్వామ్యం చేయ్యబోమని అధిష్ఠానం స్పష్టం చేసిందన్నారు. 'కుటుంబ పాలన కావాలంటే కేసీఆర్‌కు ఓటు వేయండి.. ప్రజల పాలన కావాలంటే కాంగ్రెస్‌కు ఓటు వేయండి' అనే నినాదంతో ఎన్నికలకు వెళ్తున్నామన్నారు. ఈ సమావేశంలో అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, సంపత్‌ తదితరులు పాల్గొన్నారు..

Post a Comment

0 Comments

Latest News

Powered by Blogger.

Admin

Admin
Content published by Samajika Spandana.